Click hear
న్యూదిల్లీ: నల్లధన నిర్మూలనను మోదీ ప్రభుత్వం వేగవంతం చేసింది. దీనిలో భాగంగా ఇటీవల 2.09 లక్షల డొల్ల కంపెనీల గుర్తింపును రద్దు చేసిన ప్రభుత్వం.. తాజాగా వాటి వెనక ఉన్న ‘వాస్తవ లబ్ధిదారుల’ను గుర్తించే పనిలో ఉంది. దీంతో పాటు మరిన్ని డొల్ల కంపెనీలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుందని స్పష్టంచేసింది.
ఏళ్లుగా వ్యాపార కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉన్న 2.09 లక్షల నమోదిత కంపెనీల గుర్తింపును ఇటీవల ఆర్థిక శాఖ రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆయా కంపెనీల బ్యాంకు ఖాతాలను కూడా నిలిపివేసింది. సదరు బ్యాంకు ఖాతాల నుంచి గుర్తింపు రద్దైన కంపెనీల డైరెక్టర్లు సొమ్మును డ్రా చేస్తే కనీసం ఆరు నెలల నుంచి గరిష్ఠంగా పదేళ్ల జైలు శిక్ష విధిస్తామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి పీపీ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు.
గుర్తింపు రద్దైన డైరెక్టర్లు మూడేళ్లు, అంతకంటే ఎక్కువ సంవత్సరాలకు రిటర్నులు దాఖలు చేయకపోతే ఒకవేళ ఇతర కంపెనీలో ఏ పదవిలో ఉన్నా అనర్హత వేటు పడుతుంది. దీంతో పాటు మళ్లీ పునర్నియామకం అయ్యే అవకాశాలు కూడా రద్దవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ చర్యల వల్ల కనీసం రెండు నుంచి మూడు లక్షల మంది డైరెక్టర్లపై అనర్హత వేటు పడుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
డొల్ల కంపెనీల వెనుక ఉన్న ‘వాస్తవ లబ్ధిదారుల’ను గుర్తించే చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఆయా కంపెనీల వెనుక ఉన్న వ్యక్తులు, వారి పాత్రకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు వివరాలు సేకరిస్తున్నాయని తెలిపింది. ఏరివేత చర్యల వల్ల కేవలం నల్లధనాన్ని అరికట్టడమే కాక పెట్టుబడిదారుల్లో విశ్వాసం నింపి, సులభతర వ్యాపారనుకూల వ్యవస్థ ఏర్పడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు.
No comments:
Post a Comment