వేలల్లో ఉద్యోగాలు.. లక్షల్లో పోటీ.. ` భిన్నంగా వెళ్తేనే విజయం: ఉదయ్‌భాస్కర్
అమరావతి: కేవలం ఒక ప్రయత్నం ద్వారానే సివిల్స్ సాధించేయాలని కోరుకుంటే ఎక్కువ శాతం అపజయాలే ఎదురవుతాయనే విషయాన్ని యువత గుర్తించాలని ఏపీపీఎస్సీ ఛైర్మన్ పి. ఉదయభాస్కర్ అన్నారు. ``21 ఏళ్ల వయసులోనే సివిల్స్ సాధించడం ఎలా?`` అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారి బి.ఎల్. హనుమంతరావు ఆంగ్లంలో రచించిన పుస్తకాన్ని ఉదయభాస్కర్ విజయవాడలో ఆవిష్కరించారు. సివిల్స్ లక్ష్య సాధన కోసం ఎన్నిసార్లు ప్రయత్నిస్తే అంతగా రాణించే అవకాశాలు ఉంటాయని, ఈ విషయంలో యువత నిరుత్సాహానికి గురికావొద్దని సూచించారు. సివిల్స్ అయినా, గ్రూప్స్ పరీక్షలైనా సాధించాలంటే లక్షల్లో పోటీ ఉంటుందని.. వేలల్లో మాత్రమే ఉద్యోగాలు ఉంటాయని అందువల్ల ఇతరుల కంటే భిన్నంగా శిక్షణలో ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన చెప్పారు. సివిల్స్ సాధనలో తెలుగు అభ్యర్థుల విజయాలు ఎందరో నిరుద్యోగ యువతకు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని చెప్పారు. బీఎల్ హనుమంత రావు సివిల్స్ పై రచించిన ఈ పుస్తకం నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. తన పుస్తకం చదివడం ద్వారా ఉత్తేజం పొంది ఒక్కరు సివిల్స్‌కు ఎంపికైనా తన ఆశయం నెరవేరినట్టేనని ప్రభుత్వ గణాంక శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్న హనుమంతరావు అన్నారు. కేబీఎన్ కళాశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కృష్ణా విశ్వవిద్యాలయం ఉపకులపతి రామకృష్ణారావు, ఉన్నత విద్యామండలి పూర్వ కార్యదర్శి రాజశేఖరరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment