
న్యూయార్క్: ఉగ్రవాదులను నియంత్రించడంలో పాకిస్థాన్ ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని భావించిన అమెరికా ఆ దేశానికి రక్షణ సాయాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. తాజాగా ఉగ్రవాదులకు నిధులను పంపిస్తూ, మనీలాండరింగ్‌కు పాల్పడుతోందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యూయార్క్‌లోని పాక్ ప్రైవేటు బ్యాంకు హబీబ్ బ్యాంక్ లిమిటెడ్(హెచ్‌బీఎల్) బ్రాంచ్‌ను మూసివేయాల్సిందిగా న్యూయార్క్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్(డీఎఫ్‌ఎస్) నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను గురువారం డీఎఫ్‌ఎస్ విడుదల చేసింది. బ్యాంకింగ్ చట్టాలను ఉల్లంఘించి లావాదేవీలు జరిపినందుకు గానూ, బ్యాంకింగ్ రెగ్యులేటరీ హెచ్‌బీఎల్‌కు 225 మిలియన్ డాలర్లు జరిమానా కట్టాల్సిందిగా ఆదేశించింది. తొలుత 629.6మిలియన్ డాలర్లు జరిమానా చెల్లించాల్సిందిగా డీఎఫ్‌ఎస్ ప్రతిపాదించినప్పటికీ చివరికి 225 మిలియన్‌డాలర్లు చెల్లించాలని తెలిపింది.
అల్‌ఖైదా లింకులకు ఈ బ్యాంకు ద్వారా బిలియన్ల డాలర్ల లావాదేవీలు జరిగినట్లు డీఎఫ్‌ఎస్ విచారణలో వెల్లడైంది. ఎటువంటి అధికారిక సమాచారం లేకుండా ఆ బ్యాంకు బ్రాంచ్ నుంచి 13వేల లావాదేవీలు జరిగాయి. అంతర్జాతీయ ఉగ్రవాదులు, ఆయుధాల డీలర్లుతో పాటు పలువురు ఈ బ్యాంకు నుంచి ఎటువంటి స్క్రీనింగ్ లేకుండా 250మిలియన్ డాలర్లు వరకు లావాదేవీలు జరుపుకొనేందుకు అవకాశం ఉంది. వారందరినీ ఈ బ్యాంకు గుడ్ గై జాబితాగా పేర్కొంది. నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించిన న్యూయార్క్ హబీబ్ బ్యాంకు లైసెన్సును తిరిగి ఇచ్చేందుకు ఆ బ్యాంకు అంగీకరించినట్లు డీఎఫ్‌ఎస్ ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది. ఉగ్రవాద కార్యకలాపాలకు నిధులు వెళ్లేలా లావాదేవీలు జరపడం వల్ల దాని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై పడుతుంది, దీన్ని డీఎఫ్‌ఎస్ ఎంతమాత్రం సహించబోదని ఫైనాన్షియల్ సర్వీసెస్ సూపరిటెండెంట్ మారియా టి.వుల్లో హెచ్చరించారు.
No comments:
Post a Comment