ఇటీవల బిహార్‌లోని 21 జిల్లాల్లో భారీ వరదలు సంభవించి 500 మందికి పైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అయితే వరదలకు కారణం ఎలుకలేనని రాష్ట్ర జలవనరుల మంత్రి రాజీవ్ రంజన్ ఆరోపించారు. ‘చెరువుగట్టుకు సమీపంలో నివసించే ప్రజలు ఆహారధాన్యాలు వేయడంతో భారీగా ఎలుకలు వస్తున్నాయి. అవి గట్లకు రంధ్రాలు చేస్తుండటంతో చెరువుగట్టు బలహీనంగా మారుతోంది. దీని వల్ల వర్షాల సమయంలో గట్లు తెగి వరదలు సంభవిస్తున్నాయి’ అని రాజీవ్ రంజన్ వ్యాఖ్యలు చేశారు. అలాంటి ప్రమాదకర గట్లను గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తున్నామని మంత్రి అన్నారు.
అటు జలవనరుల శాఖ చీఫ్ సెక్రటరీ అంజనీ కుమార్ సింగ్ కూడా తప్పంతా ఎలుకలదే అని చెప్పారు. మరోవైపు ఎలుకల వల్ల చెరువుగట్లకు రంధ్రాలు పడుతున్నది నిజమేనని నిపుణులు చెబుతున్నప్పటికీ.. తాజా వరదలు మాత్రం భారీ వర్షాల వల్లే సంభవించాయని చెప్పడం గమనార్హం. కాగా.. మంత్రి వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికార పార్టీ ఎలుకలను బలిపశువును చేస్తోందని ధ్వజమెత్తాయి. ‘ఆ మంత్రే ఓ పెద్ద ఎలుక. మంత్రి స్థానంలో ఉండి తమ వైఫల్యాలను ఇలా కప్పిపుచ్చుకుంటున్నారు’ అని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ విమర్శించారు.
కాగా.. బిహార్‌లో ఎలుకలపై ఇలా వార్తలు రావడం ఇది తొలిసారి కాదు. గత ఏప్రిల్ నుంచి రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే నిషేధం అమల్లో ఉన్నా అక్రమంగా మద్యం విక్రయాలు చేపట్టడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచారు. అయితే ఆ తర్వాత పోలీస్‌స్టేషన్లలోని మద్యం సీసాలు ఖాళీగా కన్పించాయి. దీంతో ఆ మద్యాన్ని ఎలుకలు తాగేశాయంటూ పోలీసులు చెప్పుకొచ్చారు.
No comments:
Post a Comment